అయోధ్యా రామాలయం నిధుల చోరీ కేసులో సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రామమందిర నిర్మాణానికి వచ్చిన విరాళాలు దారిమళ్లించిన కేసులో దర్యాప్తు కొనసాగుతున్న కమ్రంలో ట్రస్ట్ సోమవారం(జూలై 6) అత్యవసరం సమావేశం కానుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రాపై ఈ సమావేశంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ కేసులో విచారణ వేగవంతం చేసిన సిట్ .. ఈ వ్యవహారంలో మొత్తంఎనిమిది మందికి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తోంది. విరాళాల కౌంటర్ ఉద్యోగి అవినాష్ శుక్లాను ప్రధాన నిందితుడిగా సిట్ భావిస్తోంది. కేసులో మరిన్ని వివరాల రాబట్టేందుకు ఈ కేసు దర్యాప్తు గడువును యూపీ ప్రభుత్వం జూలై 15 వరకు పొడిగించింది.
దర్యాప్తు అధికారుల ప్రకారం.. కేసు బయటపడకముందే విరాళాల లెక్కింపులో అవకతవకలపై హెచ్చరికలు వచ్చినా వాటిని ట్రస్టు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. అలాగే సీసీటీవీ ఫుటేజీలో కొందరు నిందితులు నగదును జేబులు, సాక్సుల్లో దాచడం, బాత్రూంలలో దాచిపెట్టి తర్వాత బయటకు తీసుకెళ్లడం వంటి అనుమానాస్పద చర్యలు కనిపించినట్లు అధికారులు తెలిపారు.
కేసు వెలుగులోకి రాకముందు ట్రస్ట్ ఖాతాల్లో రోజుకు రూ.16నుంచి 18 లక్షలు జమ కాగా, అనంతరం అది రూ.24నుంచి రూ. 26 లక్షలకు పెరిగింది. దీంతో రోజుకు రూ.6నుంచి 8 లక్షలు వరకు అక్రమంగా దారి మళ్లించి ఉండవచ్చని సిట్ అంచనా వేస్తోంది.
ALSO READ : అయోధ్య: జులై 06న రామాలయ ట్రస్ట్ అత్యవసర భేటీ
2025 మహా కుంభమేళా సమయంలో భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో అదనపు లెక్కింపు సిబ్బందిని నియమించారు. ఆ నియామక ప్రక్రియను కూడా సిట్ పరిశీలిస్తోంది. బంగారం, వెండి, ఆభరణాల విరాళాల నిర్వహణలో సరైన లెక్కలు లేకపోవడంపైనా విచారణ కొనసాగుతోంది.
ఇప్పటివరకు పలువురు నిందితుల నుంచి లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సిట్ తుది రిపోర్టు సిద్ధమైన తర్వాత దానిని ట్రస్ట్‌కు సమర్పించే అవకాశం ఉంది.
